వైద్యారోగ్య శాఖలో ‘షాడో’ ఆఫీసర్‌! | - | Sakshi
Sakshi News home page

వైద్యారోగ్య శాఖలో ‘షాడో’ ఆఫీసర్‌!

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

గాడిన పడుతుందనుకుంటే...

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ‘షాడో’ అధికారి పెత్తనం నడుస్తోంది. జిల్లా అధికారికి తానే పోస్టింగ్‌ ఇప్పించానంటూ చెప్పుకుంటున్న సదరు అధికారి.. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డబ్బులు అడగడం.. ఇవ్వకపోతే ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారిందని ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

దోమకొండ డివిజన్‌లో పనిచేసే ఓ అధికారి ఇటీవలే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో పరిపాలన విభాగంలో ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్నారు. సదరు అధికారి అక్కడా, ఇక్కడా అధికారులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఏడెనిమిది నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉన్న దోమకొండ డివిజన్‌లో పనిచేస్తున్న ఓ అధికారిని టార్గెట్‌ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం వెలుగు చూసింది.

సీహెచ్‌వోకు హెచ్‌ఈవో స్థాయి బాధ్యతలు..

మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూటనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో) క్యాడర్‌లో ఉన్న వై.వెంకటేశ్వర్‌రావు అనే అధికారిని గతంలో దోమకొండ డిప్యుటీ డీఎంహెచ్‌వో కార్యాలయానికి డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. ఆయనకు డివిజన్‌లోని ఆరు పీహెచ్‌సీల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. అయితే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మానిటరింగ్‌ చేయడానికి వెంకటేశ్వర్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాం పర్యవేక్షిస్తున్నారు. డీఎంహెచ్‌వో ఇచ్చిన ఆర్డర్‌పై పనిచేస్తున్న వెంకటేశ్వర్‌రావును.. సదరు షాడో అధికారి టార్గెట్‌ చేసుకుని అన్నారం పీహెచ్‌సీకి డిప్యూటేషన్‌పై పంపించారు. అదే రోజు జాయిన్‌ కావాలని ఉత్తర్వులు ఇవ్వడంతో వెంకటేశ్వరరావు అన్నారం పీహెచ్‌సీలో రిపోర్టు చేశారు. వాస్తవంగా అన్నారం పీహెచ్‌సీలో సీహెచ్‌వో పోస్టు లేదు. అక్కడ హెచ్‌ఈవో పోస్టు ఉంది. అక్కడ హెచ్‌ఈవోగా పనిచేస్తున్న వ్యక్తిని ఇటీవలే రాజంపేటకు డిప్యూటేషన్‌పై పంపించారు. ఒకవేళ అన్నారం పీహెచ్‌సీలో అవసరం ఉంటే హెచ్‌ఈవో డిప్యూటేషన్‌ను క్యాన్సిల్‌ చేసి అక్కడ పని చేయించాలి. కానీ గెజిటెడ్‌ హోదా కలిగిన సీహెచ్‌వోను హెచ్‌ఈవో పోస్టుకు డిప్యూటేషన్‌పై పంపడంపై విమర్శలు వస్తున్నాయి. డిప్యూటేషన్‌పై పంపడమే కాకుండా అక్కడి అధికారి, సిబ్బందికి ఫోన్లు చేస్తూ వెంకటేశ్వరరావు డ్యూటీకి వస్తున్నారా లేదా అని ఎంకై ్వరీ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. వెంకటేశ్వరరావు వివాదాలకు దూరంగా ఉంటారని, డ్యూటీ మైండ్‌తో పనిచేస్తారని వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. సర్వీస్‌ మొత్తంలో చిన్న కంప్లయింట్‌ కూడా లేని అధికారిని షాడో ఆఫీసర్‌ వేధిస్తుండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సదరు షాడో అధికారి జిల్లా కార్యాలయంలో పనిచేసే ఓ అధికారితోనూ దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండే జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా రవీందర్‌గౌడ్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాతైనా శాఖ గాడిన పడుతుందని భావించారు. అయితే వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న షాడో అధికారి తీరుతో ఉద్యోగులు విసిగిపోతున్నారు. ఇబ్బందులకు గురిచేస్తున్న షాడోకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. సదరు షాడో అధికారి వ్యవహారంపై ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమంలో బిజీగా ఉన్నానన్నారు. రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటానన్నారు. సీహెచ్‌వో వెంకటేశ్వర్‌రావుకు శాఖలో మంచి అధికారి అన్న పేరుందని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో పేర్కొన్నారు.

పనిచేసేవారికి వేధింపులు

సీనియర్‌ అధికారికి తక్కువ స్థాయి పోస్టుకు డిప్యూటేషన్‌

పలువురిపై దురుసు ప్రవర్తన

ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు

Advertisement
 
Advertisement
Advertisement