కామారెడ్డి టౌన్ : రక్తదానం చేసి ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని కాపాడి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘంల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన ఈ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలతో పాటు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్లను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో గిరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు కొంగల వెంకటి, ప్రవీణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.


