ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

ప్రజల్లో అవగాహన పెంచండి

వడదెబ్బ తగలకుండా

జాగ్రత్తలు పాటించాలి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి క్రైం: ఎండలు ముదురుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తీవ్రమైన వడగాలులు నమోదవుతున్నాయన్నారు. ఎండల కారణంగా ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో తాగునీటి సరఫరా, చలివేంద్రాల ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల నిల్వలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటి చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. జిల్లావ్యాప్తంగా బస్టాండ్లు, మార్కెట్లు, పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేసేలా 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈనెల 16 నుంచి వచ్చేనెల 15 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్‌, మధుమోహన్‌, డీఎంహెచ్‌వో రవీందర్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘ఇళ్ల గణన’ పారదర్శకంగా నిర్వహించాలి

కామారెడ్డి టౌన్‌ : జన గణనలో భాగంగా చేపట్టనున్న హౌస్‌ లిస్టింగ్‌ (ఇళ్ల గణన) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జన గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళీకేరి సూచించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మే 11నుంచి నిర్వహించే ఇళ్ల గణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని సూచించారు. ఇళ్ల జాబితా బ్లాక్‌లను రూపొందించాలని, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సంగ్వాన్‌ మాట్లాడుతూ.. హౌస్‌ లిస్టింగ్‌ ప్రక్రియను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

‘టీపీఎస్‌’ కోసం చర్యలు వేగవంతం చేయాలి

కామారెడ్డి టౌన్‌ : నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆమె కలెక్టర్‌లు, డీఈవోలు, ఇంజినీర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఎల్లారెడ్డిలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి, అవసరమైన మౌలిక వసతులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement