కామారెడ్డి క్రైం: ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో ముఖం గుర్తింపు ఆధారిత నమోదు ద్వారా అత్యధిక కూలీల హాజరు నమోదు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సన్మానించారు. నాగిరెడ్డిపేట్ మండలం లింగంపల్లి కలాన్ గ్రామానికి చెందిన అంజయ్య (238 కూలీల నమోదు), సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి చెందిన రాములు (216 కూలీల నమోదు), భిక్కనూరు మండలం తిప్పాపూర్‌కు చెందిన నరేష్ (197 కూలీల నమోదు)లకు రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్‌డీవో సురేందర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


