మెగా రక్తదానం శిబిరం విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మెగా రక్తదానం శిబిరం విజయవంతం చేయాలి

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

మెగా రక్తదానం శిబిరం విజయవంతం చేయాలి హిందూ సమ్మేళనానికి తరలిరావాలి గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశానికి దరఖాస్తులు పేకాడుతున్న ఆరుగురి అరెస్టు

కామారెడ్డి టౌన్‌ : రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని కర్షక్‌ బీఎడ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బాదావత్‌ ప్రవీణ్‌ నాయక్‌ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరాన్ని ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్‌ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణ రక్షణ కోసం అందజేస్తామని వివరించారు. ఈ సందర్భంగా రక్తదాతలను ప్రోత్సహించేందుకు సంఘం సభ్యుల సహకారంతో మొదటి 100 మంది దాతలకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సంగయ్య, కోశాధికారి శ్రీనివాస్‌, మండల అధ్యక్షులు రాజయ్య, నాయకులు ఎర్ర లింగం, సత్యం, నరసయ్య, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): మహమ్మద్‌ నగర్‌ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్‌ హాల్‌లో ఈ నెల 19న నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని హిందూ సమ్మేళనం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి కోరారు. సోమవారం మహమ్మద్‌ నగర్‌ మండలం గాలీపూర్‌, ముగ్థుంపూర్‌ గ్రామాల్లో హిందు సమ్మేళన కార్యక్రమం నిర్వహణపై ఊరూరా కరపత్రాలు పంపిణీ చేశారు. సమ్మేళనం కార్యవర్గ సభ్యులు రాజాగౌడ్‌ స్వామి, శ్రావణ్‌, రవికిరణ్‌ తదితరులు ఉన్నారు.

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించనున్న పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ బాసర జోన్‌ అధికారి యుగంధర లక్ష్మి సోమవారం తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రవేశపరీక్షకు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు www. tgswreis. telangana. gov. in వెబ్‌సైట్‌ ద్వారా నామమాత్రపు రుసుము చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ నెల 25 లోపు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని, మే 15న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు.

ఆర్మూర్‌టౌన్‌: పెర్కిట్‌లో ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌లో పేకాట స్థావరంపై ఆదివారం రాత్రి సీసీఎస్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 1,17,940 నగదు, మూడు కార్లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement