సెకండ్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
● మొదటి రోజు ఎగ్జామ్‌కు హాజరైన 98.16 శాతం మంది విద్యార్థులు
● నాలుగు సెంటర్‌లలో వందశాతం హాజరు నమోదు
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,878 మంది విద్యార్థులకు గాను 7,733 మంది (98.16 శాతం) పరీక్షకు హాజరు కాగా, 145 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పిట్లం, మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, టీజీఎంఎస్ మీనూర్, పీజేఆర్ స్ఫూర్తి కళాశాల కేంద్రాల్లో 100 శాతం విద్యార్థుల హాజరు నమోదైంది. జిల్లాలో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. ఎస్పీ రాజేశ్‌చంద్ర జిల్లా కేంద్రంలోని పలు పరీక్షాకేంద్రాలను తనిఖీ చేశారు. బందోబస్తు సిబ్బందికి పలు సూచనలు చేశారు.


