కాలేజీ భూములు కాపాడటంలో విఫలం | - | Sakshi
Sakshi News home page

కాలేజీ భూములు కాపాడటంలో విఫలం

Feb 27 2026 4:21 AM | Updated on Feb 27 2026 4:21 AM

కాలేజీ భూములు కాపాడటంలో విఫలం

కాలేజీ భూములు కాపాడటంలో విఫలం

కాలేజీ భూములు కాపాడటంలో విఫలం

శిశుమందిర్‌ భూములపై దుష్ప్రచారం

విద్యార్థి సంఘాల ఆరోపణ

రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని

అడ్డుకున్న పోలీసులు

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ.. విద్యాసంస్థల ఆస్తులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే అణచివేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1964లో రైతులు విద్యా అవసరాల కోసం ఇచ్చిన 268 ఎకరాల భూమిని కాపాడటంలో కాలేజీ ఎడ్యుకేషన్‌ సొసైటీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం ఈ భూములను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో విద్యార్థి సంఘాల నాయకులు ఆజాద్‌, సందీప్‌కుమార్‌, జీవీఎం విఠల్‌, అరుణ్‌, లక్ష్మణ్‌, నాగరాజు, ప్రజా సంఘాల నాయకులు ఆకుల బాబు తదితరులు ఉన్నారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన భూముల వివరాలపై కలెక్టర్‌ తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు కోరారు. ఈమేరకు కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు ఎన్ని ఎకరాలు కేటాయించారు, ప్రస్తుతం కళాశాల పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయి ఉన్న భూమి ఎంత అనే విషయాలను మ్యాప్‌తో సహా స్పష్టం చేయాలని కోరారు. 2021లో చేపట్టిన సర్వే వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ఏబీవీపీ విభాగ్‌ కన్వీనర్‌ శశి, పట్టణ కార్యదర్శి సంజయ్‌, నాయకులు విష్ణు, చరణ్‌, కౌశిక్‌, అజార్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీసరస్వతీ శిశుమందిర్‌ పాఠశాల భూములపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పాఠశాల కమిటీ సభ్యులు గీరెడ్డి రాజారెడ్డి, సామల గంగారెడ్డి, అర్కల మల్లేశ్‌యాదవ్‌, ప్రతాప్‌గౌడ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయవాద స్వచ్ఛంద సేవా సంస్థగా, విద్యాభారతి అనుబంధంగా దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు నడుస్తున్నాయని, అందులో భాగంగానే కామారెడ్డిలోనూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని వారు పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా పాఠశాల భూమిని కబ్జా చేసినట్లు చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. కామారెడ్డి కాలేజీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ తమ వినతి మేరకు సరస్వతీ విద్యాపీఠానికి రెండు ఎకరాల స్థలాన్ని లీజుకు ఇచ్చిందని, ఆ స్థలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ దాతల సహకారంతో ఎంతో మందికి గుణాత్మకమైన విద్యను అందిస్తున్నామని, అభివృద్ధి పథంలో నడుస్తున్న పాఠశాలను ఇబ్బందులకు గురిచేయొద్దని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement