ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం
● మొదటిరోజు 96.48 శాతం
విద్యార్థుల హాజరు
● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన
కలెక్టర్, అదనపు కలెక్టర్
కామారెడ్డి టౌన్: జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాల్లో మొదటిరోజు ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. పరీక్షలకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ిసీసీ కెమెరాల నిఘా నీడలో ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాలకు అనుమతించారు. మొదటి రోజు కావడంతో కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం విద్యార్థులు 9,565 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 9,228 మంది హాజరయ్యారు. 337 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. హాజరు 96.48 శాతం నమోదైంది. సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్‌లో కేటాయించిన 209 మందికి అందరూ హాజరై 100 శాతం హాజరు నమోదైంది. జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అత్యల్పంగా 88.13 శాతం హాజరు నమోదైంది. పరీక్షల నిర్వహణను జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ విక్టర్ రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాల వద్ద బందోబస్తును సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్‌ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదని ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం తెలిపారు. గురువారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం


