మున్సిపాలిటీల అభివృద్ధిపై దృష్టిసారించాలి
● నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పువు
● మున్సిపల్ అధికారులతో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష
కామారెడ్డి టౌన్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అభివృద్ధిపై దృష్టిసారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ మధుమోహన్‌తో కలిసి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల కమిషనర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన గృహాలు మంజూరు చేయాలని సూచించారు. పీఎంఏవైయూ, అమృత్ పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆస్తి పన్ను వసూళ్లలో వందశాతం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ప్రకటన బోర్డుల ద్వారా మున్సిపాలిటీల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. మున్సిపల్ వార్డు అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ ఫీల్డ్ లెవల్‌లో పర్యటించి పనులను పర్యవేక్షించడమే కాకుండా, సంబంధిత ఫొటోలను పంపాలని స్పష్టం చేశారు. అక్రమ ఆక్రమణల తొలగింపులో నిర్లక్ష్యం వహించవద్దని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏబీసీ సెంటర్ల నిర్వహణ, శానిటేషన్ వాహనాల వినియోగం, టీజీబీపాస్ అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.


