‘భరోసా’ ఎప్పుడొస్తుందో
కామారెడ్డి క్రైం: యాసంగి పంట సాగు పెట్టుబడి కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. డిసెంబర్‌లో అందాల్సిన రైతు భరోసా (పెట్టుబడి సాయం) ఇప్పటికీ విడుదల కాకపోవడంపై అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తవగానే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసింది. దీంతో ఈ నెల 17 నుంచి రైతు భరోసా నిధులు జమ కావొచ్చని అంతా భావించారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
జిల్లాలో 3.28 లక్షల మంది రైతులు..
కామారెడ్డి జిల్లాలో మొత్తం 3,28,240 మంది రైతులున్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున జిల్లాలోని రైతులందరికీ పెట్టుబడి సాయం అందించాలంటే రూ.315 కోట్లు అవసరం. అయితే, శాటిలైట్ సర్వే ద్వారా పంటలు సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందేలా చూస్తామని జనవరి నెలాఖరులో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొంత సమయం పడుతుందని అందరూ భావించారు. శాటిలైట్ సర్వే ఫలితాలు ఏమయ్యాయో తెలియదు. ఇదిలా ఉండగా రైతుభరోసా నిధులు విడుదల చేసే ప్రతిసారి కనీసం వారం రోజుల ముందు కొత్త రైతులు, పాస్‌బుక్కులు, అకౌంట్ల వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు. దీంతో ప్రభుత్వం మళ్లీ దాటవేసే ధోరణిలో ఉన్నదా? అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
రబీ పెట్టుబడి సాయం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. త్వరలో వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
– మోహన్ రెడ్డి, డీఏవో, కామారెడ్డి
వడ్డీ వ్యాపారులే దిక్కయ్యారు..
గత ఖరీఫ్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటల దిగుబడి తీవ్రంగా పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. చాలా కాలంగా మార్కెట్‌లో అప్పు పుట్టని పరిస్థితులున్నాయి. దీంతో రబీ పంటల పెట్టుబడుల కోసం రైతులు చాలా ఇబ్బందిపడ్డారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. మొక్కజొన్న, జొన్న లాంటి కొన్ని రకాల పంటలు మరో నెల గడిస్తే కోతకు రానున్నాయి. సీజన్ సగానికి పైగా పూర్తి కావొస్తుంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు కోరుతున్నారు.
రైతుల ఎదురుచూపులు
ముగిసిన మున్సిపల్ ఎన్నికల కోడ్
17 నుంచి ఇస్తామంటూ గతంలో
సీఎం ప్రకటన
ఇప్పటి వరకు అందని ఉత్తర్వులు
కష్టాల్లో కర్షకులు
‘భరోసా’ ఎప్పుడొస్తుందో
‘భరోసా’ ఎప్పుడొస్తుందో


