పదిలో మాల్ ప్రాక్టీస్‌కు తావివ్వొద్దు
● ప్రశాంత వాతావరణంలో
పరీక్షలు జరగాలి
● నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం : పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు మానసికంగా ధైర్యం చెప్పి ప్రోత్సహించాలన్నారు. పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 65 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష ప్రారంభానికి ముందుగానే విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఈవో రాజు, అసిస్టెంట్ కమిషనర్ బలరాం, డీసీఈబీ సెక్రెటరీ ఎన్.లింగం, సంబంధిత అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.


