బాన్సువాడ బంద్ ప్రశాంతం
బాన్సువాడ: ఇరువర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో బాన్సువాడ పట్టణం పోలీసుల వలయంలోకి వెళ్లింది. హిందూ సంఘాల పిలుపు మేరకు శనివారం బాన్సువాడ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపారలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. బంద్ నేపథ్యంలో పట్టణంలో పోలీసు బల గాలు మోహరించాయి. బస్టాండ్, తాడ్కోల్ రోడ్డు, టీచర్స్ కాలనీ, సంగమేశ్వర కాలనీ, తాడ్కోల్, కొయ్యగుట్ట తదితర ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. బాన్సువాడకు వచ్చే వారి నుంచి వివరాలు సేకరించారు. ఎస్పీ రాజేశ్ చంద్ర శనివారం బాన్సువాడలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణకు కారకులైన 42 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. దర్యాప్తు వేగంగా కొనసాగుతుందని, ఘటనలో పాల్గొన్న వారిలో 12 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని అన్నారు. ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని, చిన్న ఘటనను ఆధారంగా చేసుకొని కొందరు గుంపులుగా ఏర్పడి, శాంతియుతంగా ఉన్న పట్టణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు. ఎవరైనా మత విద్వేషాలను ప్రేరేపించేలా, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేలా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాన్సువాడలో ప్రస్తుతం పూర్తిగా ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని తెలిపారు. సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఆడియో, వీడియోలను పోస్టు చేయొద్దని, వాట్సాప్ గ్రూప్ నిర్వాహకులను బాధ్యులుగా పరిగణిస్తూ కేసులు నమోదు చేస్తామన్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి డీఎస్పీలు విఠల్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, సీఐలు శ్రీధర్, తిరుపయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
పోలీసుల భారీ బందోబస్తు
ఘటనకు కారకులైన వారిలో
12 మంది రిమాండ్
పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు
ముమ్మరంగా గాలింపు
మత విద్వేషాలు రెచ్చగొడితే
కఠిన చర్యలు
హెచ్చరించిన ఎస్పీ రాజేశ్ చంద్ర


