నికాల్‌పూర్‌లో పావురాల కలకలం
● కాళ్లకు రింగ్ చూసి ఆందోళనకు
గురైన గ్రామస్తులు
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం నికాల్‌పూర్ గ్రామంలో శుక్రవారం ట్యాగ్ కలిగిన పావురాలు కలకలం సృష్టించాయి. వాటి కాళ్లకు ఉన్న పసుపు రంగు ట్యాగ్ (రింగు), దానిపై నంబర్లను చూసి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామ శివారులోని జంగం చెరువు ప్రాంతంలో మత్స్యకారులు ఉంచిన చేపల వలకు మూడు పావురాలు చిక్కుకున్నాయి. స్థానిక వ్యవసాయదారులు గమనించి పావురాలను వల నుంచి తీసే ప్రయత్నం చేశారు. కాళ్లకు ఉన్న రింగు లాంటి పరికరాన్ని చూసి ఏంటోనని ఆందోళనకుగురయ్యారు. గ్రామస్తులకు సమాచారం అందించగా వారు కూడా వచ్చి పావురాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. గూఢచారి పావురాలని ఒకరు, జీపీఎస్ ట్రాకింగ్ చేసేవని మరొకరు, రేసింగ్ పావురాలని ఇంకొకరు చర్చించుకున్నారు. పావురాల కాలికి ఉన్న రింగ్‌పై ‘702’ నంబరుతోపాటు కేఎల్‌ఆర్‌పీసీ, కేవోఎల్‌ఏఆర్ 2025–ఇండియా అని రాసి ఉంది. ఇలాంటివి సాధారణంగా రేసింగ్ పావురాలకే ఉంటాయని లేదా ప్రభుత్వాలు కూడా పావురాల కదలికలు, సంచార సమాచారం తెలుసుకోవడానికి ఇలాంటి ట్యాగ్‌లు కడుతారని అవగాహన కలిగిన ఒకరిద్దరు అధికారులు ‘సాక్షి’తో పేర్కొన్నారు. నికాల్‌పూర్ బ్యాక్ వాటర్‌కు ఆనుకొని ఉన్న గ్రామం కావడంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం నుంచి దారితప్పి వచ్చి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వలలో చిక్కుకున్న ఆ మూడు పావురాలను గ్రామస్తులు వదిలిపెట్టారు.
మూడు ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని లింబూర్ శివారులో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు మూడు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేశారు. అందులో ఉన్న ఆయిల్, కాపర్ వైర్ చోరీ అపహరణకు గురైనట్లు రైతులు పురుశోత్తం, గజానంద్, శంకర్ తెలిపారు. పోలీసులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ దుండగులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కరపత్రాల ఆవిష్కరణ
బోధన్‌టౌన్: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బోధన్‌లో హిందువాహిని ఆధ్వర్యంలో ఈ నెల 19న చేపట్టే భారీ ర్యాలీ కరపత్రాలను ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ బోధన్ నగ ర కార్యవాహ్ దులిశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ జయంతిని సందర్భంగా చేపడుతున్న ర్యాలీని హిందువులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో హిందూవాహిని జిల్లా ఉపాధ్యక్షుడు పులి సాయిలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
నికాల్‌పూర్‌లో పావురాల కలకలం


