అధికారం వైపే!
బల్దియాలను కోల్పోయినా..
● మూడు మున్సిపాలిటీలు ‘హస్త’గతం
● కామారెడ్డిలో అన్ని పార్టీలకు ఆదరణ
● గట్టి పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్
● ఉనికి చాటుకున్న బీజేపీ
బాన్సువాడ కౌంటింగ్ హాల్ వద్ద కాంగ్రెస్ నేతల విజయోత్సవాలు
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా మూడు చోట్ల అధికార పార్టీ జయకేతనం ఎగురవేసింది. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కామారెడ్డి ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుతో హంగ్ ఏర్పడింది.
● బాన్సువాడలో 19 వార్డులకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి బోణీకొట్టిన బీజేపీ.. ఏకంగా మూడు స్థానాలను గెలుచుకుంది. బీఆర్‌ఎస్ మూడు స్థానాలకు పరిమితమయ్యింది. ఒక వార్డులో ఎంఐఎం, ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలుపొందారు.
● ఎల్లారెడ్డిలో 12 స్థానాలుండగా.. 10 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక వార్డులో బీఆర్‌ఎస్, మరో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.
● బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులకుగాను 10 వార్డుల్లో కాంగ్రెస్, రెండు వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
● కామారెడ్డి పట్టణంలో 49 వార్డులకుగాను 19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. 16 వార్డుల్లో బీజేపీ, 11 వార్డుల్లో బీఆర్‌ఎస్, మూడు వార్డుల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు.
పెరిగిన బీజేపీ బలం...
మున్సిపాలిటీలలో బీజేపీ బలం పెరిగింది. గతంలో కామారెడ్డి మున్సిపాలిటీలో మాత్రమే బీజేపీకి ప్రాతినిధ్యం ఉంది. గతంలో 8 వార్డులు కలిగి ఉన్న బీజేపీ.. ఈసారి తన బలాన్ని రెట్టింపు చేసుకుని చైర్‌పర్సన్ రేసులో నిలిచింది. కొన్ని వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. బాన్సువాడ బల్దియాలో బోణీ కొట్టింది. ఆ పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంది. ఎల్లారెడ్డి, బిచ్కుందలలో మాత్రం సీట్లు దక్కలేదు.
అత్యధిక, అత్యల్ప మెజారిటీలు..
కామారెడ్డి టౌన్: కామారెడ్డి బల్దియాలో అత్యధిక మెజారిటీ 22 వ వార్డులో నమోదయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆఫ్రీన్ సుల్తానా 701 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. కాగా కామారెడ్డి బల్దియాలో అత్యధిక ఓట్లు కూడా ఆమెకు పడ్డాయి. 1,098 ఓట్లు సాధించారు.
38వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి మూడు ఓట్ల తేడాతో గెలిచారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గట్టిపోటీ ఇచ్చింది. కామారెడ్డి పట్టణంలో 49 వార్డుల్లో పోటీ చేసిన బీఆర్‌ఎస్ 11 స్థానాల్లో గెలుపొందడంతో పాటు పలు వార్డుల్లో గౌరవ ప్రదమైన ఓట్లు సాధించింది. ఎల్లారెడ్డిలో ఒకే సీటు వచ్చింది. బాన్సువాడలో మూడు వార్డుల్లో, బిచ్కుందలో రెండు వార్డుల్లో గెలుపొందింది. అయితే కొన్ని వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు.
పుర ఓటర్లు అధికార పార్టీకి అండగా నిలిచారు. మూడు బల్దియాలను కాంగ్రెస్ ఖాతాలో వేశారు. కామారెడ్డి ఓటర్లు మాత్రం విభిన్నంగా ఓటేసి, ఎవరికీ మెజారిటీ ఇవ్వలేదు. దీంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. కాగా జిల్లాలోని నాలుగు బల్దియాల పరిధిలో బీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇవ్వగా.. బీజేపీ బలాన్ని గణనీయంగా పెంచుకుంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
అధికారం వైపే!
అధికారం వైపే!


