రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నస్రుల్లాబాద్: మండలంలోని సంగం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సదాశివనగర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. సంగం గ్రామానికి చెందిన పూల్ సింగ్(26)కు 8 నెలల క్రితం బీపీఎంగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ రీత్య మణిపూర్ రాష్ట్రంలో ఉన్న అతడు నెలరోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇటీవల ఎంబీఏ సెమిస్టర్ పరీక్షల కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. రెండు రోజులు వరుస సెలవులు రావడంతో శుక్రవారం హైదరాబాద్ నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. సదాశివనగర్ మండలంలోని భూంపల్లి శివారులో అతడి బైక్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్సులో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.


