సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో శుక్రవారం సీఎం కప్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్, రెజ్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్‌గౌడ్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వినోద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్: జుక్కల్ మండల ప్రజలను చిరుత భయపెడుతోంది. గురువారం రాత్రి శక్తినగర్ గ్రామ శివారులోని శ్మశాన వాటిక వద్ద చిరుత పులి రోడ్డు దాటుతూ వాహనదారుల కంటపడింది. రోడ్డు దాటివెళ్తున్న చిరుత పులిని వాహనదారులు వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. దీంతో శక్తినగర్, సావర్‌గావ్, ఖండెబల్లూర్ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి చిరుతకు బంధించాలని కోరుతున్నారు.
సదాశివనగర్: రైతు ఉత్పత్తిదారుల సంఘంలో ప్రతి రైతు సభ్యత్వం పొందాలని జిల్లా సహకారశాఖ అధికారి రామ్మోహన్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎఫ్‌పీవోపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటలను మార్కెటింగ్ చేసుకోవడానికి ఎఫ్‌పీవోలు మంచి అవకాశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ లక్ష్మణ్, విండో చైర్మన్ కమలాకర్‌రావు, ఏఎంసీ డైరెక్టర్ సురేశ్, సీఈవో విఘ్నేశ్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: కామారెడ్డి బల్దియాలో దంపతులిద్దరు కౌన్సిలర్లుగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. పట్టణంలోని 46వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెరికంటి లక్ష్మీనారాయణ మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. ఆయన భార్య స్వప్న 47 వార్డునుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయతీరాలకు చేరారు. కాగా స్వప్న గత కౌన్సిల్‌లోనూ సభ్యురాలిగా పనిచేశారు. భార్యాభర్తలిద్దరూ విజయం సాధించడం గమనార్హం.
కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆరో వార్డు కౌన్సిలర్‌గా నిట్టు గంగాధర్‌రావు ఎన్నికయ్యారు. ఆయన పాతికేళ్ల క్రితం సరంపల్లి సర్పంచ్‌గా పనిచేశారు. 2001 నుంచి 2006 వరకు సర్పంచ్‌గా ఉన్నారు. ఆ గ్రామం 2018లో కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమయ్యింది. తాజాగా నిర్వహించిన ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీనుంచి పోటీ చేసి కౌన్సిలర్ అయ్యారు.
నిజామాబాద్ రూరల్: గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి, 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈనెల 22న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల డీసీవో విజయలలిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో ప్రవేశాల కోసం జిల్లాలోని 23 కేంద్రాల్లో మొత్తం 8,901 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు 22వ తేదీ ఉదయం 9 గంటల వరకు హాల్ టికెట్లు ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.
సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం
సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం


