ఫలితాలపై ఉత్కంఠ
బాన్సువాడ: మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయన్నా ధీమాలో అభ్యర్థులు ఉన్నారు. వార్డుల్లో ఎవరి ఓట్లు ఎవరికి పడ్డాయోనని అంచనాలు వేసుకుంటున్నారు. కొన్ని వార్డుల్లో స్వతంత్రులు గట్టీ పోటీ ఇవ్వడంతో ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఫలితాలపై పట్టణంలో అందరి నోటా అదే చర్చ కొనసాగుతుంది. మరి కొన్ని గంటల్లో ఫలితాలు వెలవడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉన్నాయి. పట్టణంలో 24,188 మంది ఓటర్లు ఉంటే 17,817 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వార్డుల్లో ముఖ్యంగా అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది. కొన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు గట్టీ పోటీ ఇస్తే మరి కొన్ని వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు భారీగా ఓట్లను ప్రభావితం చేశారు. ఒక్కటి రెండు వార్డుల్లోనైతే స్వతంత్ర అభ్యర్థులు గెలుపు అంచుల్లో ఉన్నట్లు తెలిసింది. ఓటర్ల నాడి తెలుసుకోవడంలో అభ్యర్థులు పడుతున్న పాట్లు అంతాఇంతా కాదు. గెలుపొటములపై ఒక్కొక్కరు ఒక్కలా సమాధానం చెప్పడంతో అభ్యర్థుల్లో ఆందోళన కలుగుతోంది. అభ్యర్థులు గెలుపు ధీమాతో ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. పెట్టిన ఖర్చులకు ఎన్ని ఓట్లు వస్తాయో లెక్కలేసుకుంటున్నారు. అభ్యర్థుల అనుచరులు మాత్రం అన్నా మనదే గెలుపు అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గతంలో ఒకే పార్టీలో ఉన్న అభ్యర్థులు ప్రస్తుతం ప్రత్యర్థులుగా మారడంతో ఈ ఎన్నికల్లో ఖర్చులు తలకు మించి భారమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్లు అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ప్రచార అస్త్రాలుగా మారాయి. ఈ ఫలితాల్లో ఎంత ప్రభావం చూపుతాయో అనేదే ప్రశ్న. ఫలితాల ఉత్కంఠకు మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. కాంగ్రెస్ నుంచి మున్సిపల్ చైర్మన్‌గా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ సతీమణి విజయను ఇది వరకే ప్రకటించారు. దీంతో అందరి చూపు 5వ వార్డుపైనే ఉంది. బాన్సువాడ పుర పీఠం ఎవరికి వరించునో నేటి ఫలితాల లెక్కింపుతో తేలిపోనుంది.
గెలుపు ధీమాలో అభ్యర్థులు
ఓట్లపై అంచనాలు వేసుకుంటున్న పోటీదారులు
ఫలితాలపై స్వతంత్రుల ప్రభావం
పట్టణంలో కొనసాగుతున్న చర్చ


