క్రైం కార్నర్
విద్యుత్‌షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి
భిక్కనూరు: విద్యుత్‌షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన గౌనిభూమయ్య (60) భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం పొలంలో బోర్ మోటర్‌ను ప్రారంభించేందుకు వెళ్లాడు. అక్కడ స్టార్టర్ బాక్సుకు విద్యుత్ సరఫరా అవుతున్న విషయాన్ని గమనించని భూమయ్య దానికి తగలడంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
నిజామాబాద్ లీగల్/ నిజాంసాగర్: కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. రెండువేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ సెకండ్ క్లాస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి (ఎస్సీ, ఎస్టీ కోర్టు) టి. శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పిప్పిరేగడి తండాకు చెందిన కేతావత్ పరశురాం, తమ గ్రామ శివారులోని హసన్‌పల్లిలో కురుమ భూమయ్యకు చెందిన ఎకరం ఇరవై గుంటల వ్యవసాయ భూమి కొనుగోలుకు రూ. రెండు లక్షల ఇరవై వేల నగదును మొదట బయానాగా ఇచ్చాడు. మిగతా డబ్బులు పట్టా అయ్యాక చెల్లిస్తానని ఒప్పందం కుదిరింది. ఈ వ్యవహారంలో 16.07.2021న పిప్పిరియగడి తండాకు పెద్దమనిషి ఇత్యా నాయక్ పిలుపు మేరకు పరశురాం తన మామతో కలిసి అక్కడికి వెళ్లాడు. ఈ సమయంలో భూమి అమ్మిన కురుమ భూమయ్య అల్లుడు బోయిన ప్రవీణ్‌కుమార్, హసన్‌పల్లి మాజీ సర్పంచ్ సంగమేశ్వర్‌గౌడ్, కురుమ భద్రయ్యలు కలిసి డబ్బులు వద్దు.. మా భూమి మాకు కావాలి అంటు వివాదం సృష్టించారు. అనంతరం పరశురాంను కులం పేరుతో దూషించి, బెదిరించి చేతులతో, చెప్పులతో దాడి చేశారు. దీంతో బాధితుడు పరశురాం తన మామతో కలిసి దాడి విషయమై నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసును విచారించిన పోలీసులు, దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కేసులో సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలను పరిశీలించిన నిజామాబాద్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి(ఎస్సీ, ఎస్టీ కోర్టు) టీ శ్రీనివాస్ నిందితులు కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
క్రైం కార్నర్


