కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
● ఎల్లారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి
ఎంపీ నిధులు పూర్తిగా అందిస్తాం
● జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్
ఎల్లారెడ్డిరూరల్: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్‌కే మద్దతుల పలకాలని, రెండేళ్ల కాంగ్రెస్ ప్రజా పాలనలో ఎల్లారెడ్డి ఎంతో అభివృద్ధి చెందిందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుతో కలిసి ఎంపీ మాట్లాడారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మురికి కాలువలు, వీధి దీపాలు, పార్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. తాను గతంలో ఎంపీగా ఉన్న సమయంలోనే ఎల్లారెడ్డికి మోడల్ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించానన్నారు. ఎల్లారెడ్డి మీదుగా రుద్రూర్ వరకు ఎన్‌హెచ్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే కరీంనగర్–కామారెడ్డి– ఎల్లారెడ్డి నేషనల్ హైవే పనులు జరుగుతాయని అన్నారు. దీనికి సంబంధించిన నిధులు త్వరలోనే మంజూరవుతాయని అన్నారు.
కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: ఎమ్మెల్యే
మున్సిపల్‌లో 12 వార్డుల్లో గెలుపే లక్ష్యమని, కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన బస్టాండ్ పునర్నిర్మాణం, పెద్ద చెరువు కట్టమీద మినీ ట్యాంక్ అభివృద్ధి, పార్క్, ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాలకు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. విలీన గ్రామాలలో విద్యుత్ లేక ఇబ్బందులు పడితే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్‌ను అందించామన్నారు. మధ్యంతరంగా వదిలి వేసిన 300 ‘డబుల్’ ఇళ్లకు నిధులు మంజూరు చేయించి లబ్ధిదారులకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్ పర్సన్ రజిత, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


