బాధ్యతాయుతంగా పనిచేయాలి
● పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అంశాలపై సో మవారం సంబంధిత నోడల్ అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ సిబ్బంది కేటాయింపు (డిస్ట్రిబ్యూషన్), పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమన్నారు. ప్రతి దశను పారదర్శకతతో, ఎలాంటి లోపాలకు తావు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్నిరకాల మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలన్నారు. ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాట్లు ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల అధికారులు మంగళవారం ఉదయం 7 గంటలకే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకోవాలని, ఎన్నికల సామగ్రిని సరిచూసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, వివిధ శాఖల నోడల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


