క్రైం కార్నర్
బాన్సువాడ రూరల్: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఎస్‌హెచ్‌వో తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండల కేంద్రంలోని డబుల్‌బెడ్ రూం కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్(37) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో అతని భార్య ఎంతలేపినా నిద్రలేవకపోవడంతో ఆమె శివకుమార్ తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
చికిత్స పొందుతూ విద్యార్థిని..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మల్లుపేట్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం కొప్పర్లకు చెందిన గడిపె గోపాల్‌రావు కుమార్తె లక్ష్మి(14) రెంజల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు కుమార్తె లక్ష్మిని రాయించేందుకు గోపాల్‌రావు తన భార్యతో కలిసి కామారెడ్డికి బైక్‌పై వచ్చారు. తిరుగు ప్రయాణంలో మల్లుపేట్ క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొన్నది. బైక్‌పై ఉన్న వీరు కింద పడడంతో లక్ష్మి తలకు బలమైన గాయమైంది. స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మద్దెల వనిత బిచ్కుంద మండలం లచ్చన్‌లో తమ బంధువు చనిపోవడంతో శుక్రవారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇంటిపక్క వ్యక్తి వనితకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. ఆమె ఇంటికి చేరుకుని పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చోరీలో బీరువాలో ఉన్న తులం బంగారం, 120 తులాల వెండిని దుండగులు చోరీకి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
క్రైం కార్నర్


