పెద్దమ్మ ఆలయంలో చోరీ
బీబీపేట: మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో శనివారం ఉదయం చోరీ జరిగినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఉదయం ఇద్దరు గుర్తు తెలియని మహిళలు తలపై కొంగు కప్పుకొని ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి మెడలో నుండి అర్ధతులం పుస్తెలు అపహరించారు. అనంతరం హుండీ తీయడానికి ప్రయత్నం చేయగా సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముదిరాజ్ సంఘం సభ్యుల సమాచారం మేరకు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంను రప్పించారు.
బాన్సువాడ రూరల్: మండలంలోని మొగులాన్ పల్లితండాకు చెందిన శ్రావణ్ అదృశ్యమైనట్లు బాన్సువాడ ఎస్‌హెచ్‌వో తుల శ్రీధర్ తెలిపారు. ఈ నెల 5న కుటుంబంలో గొడవల కారణంగా బయటికి వెళ్లిన శ్రావణ్ తిరిగి రాలేదన్నారు. శ్రావణ్ కుమారుడు దేవరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. శ్రావణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తెలుపు రంగు ధోవతి, షర్టు ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని పేర్కొన్నారు.
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని లింబూర్ గ్రామ శివారు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలేరో వాహనాన్ని ఆర్‌ఐ సాయిబాబా శనివారం పట్టుకున్నారు. పోతంగల్ మంజీర నది నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని విచారించామన్నారు. డ్రైవర్ వద్ద అనుమతిపత్రాలు లేకపోవడంతో వాహనాన్ని డోంగ్లీ తహసీల్ కార్యాలయానికి తరలించామని తెలిపారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బొల్లారం గ్రామసమీపంలో చిత్తు–బొత్తు ఆడుతున్న ఏడుగురిని శనివారం పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై భార్గ వ్‌గౌడ్ తెలిపారు. బొల్లారం శివారులో చిత్తు– బొత్తు ఆడుతున్నారని తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. ఈ మేరకు వారి నుంచి రూ.14,250 నగదుతోపాటు ఏడు మొబైల్ ఫోన్లు, 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
పెద్దమ్మ ఆలయంలో చోరీ


