‘పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు’
కామారెడ్డి క్రైం: జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల సామగ్రి సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి భోజన వసతితో సహా అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీవో వీణ, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.


