బల్దియాను కలిసికట్టుగా దోచుకున్నారు
● ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీలో గత పాలకులు ఎవరు అధికారంలో ఉన్నా.. అందరూ కలిసికట్టుగా ప్రజా ధనాన్ని దోచుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన వివిధ వార్డుల్లో బీజేపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లుగా ఎక్కడికీ పారిపోలేదని, తన కుటుంబంతో సహా కామారెడ్డిలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలోనే అందుబాటులో ఉన్నానని షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా ఆయన కౌంటర్ ఇచ్చారు. బల్దియాలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలను తాను ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాల్ విసిరారు. తాను గెలిచిన తర్వాత మున్సిపాలిటీకి ఉన్న రూ.70 కోట్ల అప్పును తీర్చి, ఆదాయ మార్గాలను పెంచి గట్టెక్కించానని, ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, బీజేపీ అభ్యర్థి చైర్‌పర్సన్ అయ్యేలా ప్రతి ఓటరు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.


