‘అవినీతి రహిత పాలన అందిస్తాం’
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీని అవినీతి రహితంగా తీర్చిదిద్దడం ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టణంలోని పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకవర్గాల హయాంలో మున్సిపాలిటీని అవినీతి ఊబిలోకి నెట్టి కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు. గత రెండేళ్లలో బీజేపీ చొరవతో మున్సిపాలిటీలో అవినీతి గణనీయంగా తగ్గిందని, అప్పుల భారాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఏడాదికి రూ. 6 కోట్ల ఆదాయం ఉంటే, తాను గెలిచిన తర్వాత దానిని రూ. 16 కోట్లకు పెంచామన్నారు. పన్నులు సక్రమంగా చెల్లిస్తే మున్సిపాలిటీకి ఏటా రూ. 24 కోట్ల వరకు ఆదాయం వస్తుందని వివరించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 16.18 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6 కోట్లు కలిపితే ఏటా దాదాపు రూ. 50 కోట్ల ఆదాయం సమకూరుతుందని లెక్కలు చూపారు. ఈ మొత్తంలో రూ. 16 కోట్ల నిర్వహణ ఖర్చులు పోగా, మిగిలిన ఆదాయం నుంచి ప్రతి వార్డుకు రూ. 75 లక్షల చొప్పున కేటాయిస్తే మూడేళ్లలో పట్టణంలోని ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించవచ్చన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించే, నీతి, నిజాయితీతో పనిచేసే బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


