‘పట్టణ రూపురేఖలు మారుస్తాం’
కామారెడ్డి టౌన్: గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కామారెడ్డి పట్టణం అభివృద్ధిలో వెనకబడిందని, కాంగ్రెస్ హయాంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పట్టణ రూపురేఖలు మారుస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్ల రోడ్డులోని కింగ్స్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా ప్రజల్లో కనిపించని ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్లీ వస్తున్నారని విమర్శించారు. ప్రెస్‌మీట్లు పెట్టి కరప్షన్ గురించి మాట్లాడే ఎమ్మెల్యే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములను అరోరా కాలేజీకి ధారాదత్తం చేసింది ఎవరో చెప్పాలన్నారు. రైతులు తమ పిల్లల చదువుల కోసం కొన్న భూములను అన్యాక్రాంతం చేయడం అవినీతి కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మంత్రంతోనే ఓటర్ల ముందుకు వెళ్తుందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. పట్టణంలో అంతర్గత రహదారుల విస్తరణ, అత్యాధునిక డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నిరంతరాయంగా శుద్ధ జలం సరఫరా చేస్తామన్నారు. అభ్యర్థులందరూ క్రమశిక్షణతో, ఐక్యమత్యంతో పనిచేసి 49 వార్డుల్లోనూ విజయం సాధించాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఇందుప్రియ పాల్గొన్నారు.


