సరస్వతి విద్యామందిర్‌లో ఫుడ్ ఫెస్టివల్
కామారెడ్డి అర్బన్: రైతులు ఎంతో శ్రమపడి పంటలు పండిస్తారని, పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని వృథా చేయవద్దని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా సంఘచాలక్ బొడ్డు శంకర్ అన్నారు. బుధవారం కామారెడ్డి సరస్వతి విద్యామందిర్ హైస్కూల్‌లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు తమకు ఇష్టమైన 160 రకాల వంటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన సంచాలన సమితి అధ్యక్షుడు గీరెడ్డి రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి బి.గోపాలకృష్ణలు భారతీయ పాకశాస్త్రం ఎంతో గొప్పదని అన్నారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, ఉపాధ్యక్షుడు సామల గంగారెడ్డి, ప్రతినిధులు రఘుకుమార్, ప్రధానాచార్యులు నల్ల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం, మరో వైపు ఉల్లిగడ్డ, అల్లమెల్లిగడ్డ విక్రయ మైకులతో హోరిత్తిస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. ప్రతిరోజు ఉల్లిగడ్డ, అల్లమెల్లి గడ్డ విక్రయ వ్యాన్‌ల ప్రచారం అరగంటకు ఒక సారి కొనసాగుతుండగా దీనికి తోడు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ప్రచార వాహనాలు అధిక శబ్దంతో ఒకటి తర్వాత మరో వాహనంతో భరింప రాని శబ్దంతో విసుగు చెందిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. పలు కాలనీల్లో అధిక శబ్దం భరించలేక తలుపులు మూసి ఉంచుతున్నారు. పోలీసులు అనుమతిలేని వాహనాల యాజమానులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


