‘అరైవ్ –అలైవ్’ ప్రారంభం
కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ అరైవ్ –అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. కార్యక్రమం ఈనెల 24 వరకు కొనసాగుతుందన్నారు. మంగళవారం ఆయన ఉగ్రవాయిలో అరైవ్ –అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉగ్రవాయి గ్రామశివారులో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగేవన్నారు. ఇక్కడ చేపట్టిన ప్రత్యేక చర్యలతో 11 నెలల్లో ఒక్క రోడ్డు ప్రమాద మరణం కూడా సంభవించలేదన్నారు. అందుకే అరైవ్ –అలైవ్ కార్యక్రమాన్ని ఉగ్రవాయి నుంచి ప్రారంభించామని తెలిపారు. నిర్లక్ష్యం, అతివేగం, అజాగ్రత్తల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. హెల్మెట్ ధరిస్తే అది మీ ప్రాణాలను కాపాడుతుందని గ్రహించాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలనే బాధ్యతను ఆటో డ్రైవర్‌లు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని పీఎస్‌ల పరిధిలో అరైవ్ – అలైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తామంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో..
జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో సీఐ నరహరి ఆధ్వర్యంలో మంగళవారం అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.


