పల్లెకు సంక్రాంతి
ఆటలతో హోరెత్తుతున్న పల్లెలు...
సంక్రాంతి పండుగకు పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వారం, పది రోజుల ముందు నుంచే సకినాలు, చేగోడీలు, గారెలు, అరిసెలు, నువ్వుల లడ్డూలు, కారపుపూస మురుకులు తయారు చేసుకుంటారు. అయితే చాలా మంది ఉద్యోగాలకోసం, ఉపాధి కోసం ఊళ్లను వదిలి పట్టణాలు, నగరాలకు వలస వెళ్లడంతో ఊళ్లల్లో వృద్ధులే ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. పండుగ సెలవులతో పట్టణాల నుంచి పిల్లలంతా రావడంతో పిండి వంటలు చేస్తున్నారు. దీంతో ఏ వీధికి వెళ్లినా పిండివంటలు చేస్తూ కనిపిస్తున్నారు. ప్రతి ఇంటినుంచి ఘుమఘుమలు వ్యాపిస్తున్నాయి.
వాకిళ్ల నిండా రంగవల్లులు...
సంక్రాంతి పండుగ నేపథ్యంలో మహిళలు ఇంటి వాకిళ్లను ముగ్గులతో రంగులమయం చేస్తున్నారు. ఏ ఇంటికి వెళ్లినా రకరకాల ముగ్గులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది మహిళలు, యువతులు రంగులు కొనుగోలు చేసి పండగపూట వాకిళ్లను అందమైన ముగ్గులతో నింపడానికి సిద్ధంగా ఉన్నారు.
రైతునగర్‌లో..
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. పాల్వంచ మండలం ఫరీదుపేటలో మూడు రోజుల పాటు క్రికెట్ పోటీలు నిర్వహించారు. తాడ్వాయి మండల కేంద్రంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఎల్లారెడ్డి పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పట్టు చీరలను అందించారు. ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌లో కబడ్డీ టోర్నమెంటులో డీఎస్పీ శ్రీనివాస్‌రావు కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. జిల్లా అంతటా వివిధ రకాల క్రీడా పోటీలు జరుగుతున్నాయి. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే పిల్లలు, పెద్దలు పతంగులను ఎగురవేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు.
పల్లెకు పండుగొచ్చింది. ఊరూరా సంక్రాంతి సందడి మొదలయ్యింది. పట్టణాల్లో ఉంటున్న వారంతా పండుగ నేపథ్యంలో పిల్లాపాపలతో ఊళ్లకు చేరుకున్నారు. మహిళలు పిండివంటలు చేస్తుండగా.. పిల్లలు, యువత పతంగులు ఎగురవేస్తూ, ఆటపాటలతో సరదాగా గడుపుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
పట్టణాల నుంచి సొంతూళ్లకు
చేరిన జనం
పిండివంటల తయారీలో
మహిళలు బిజీబిజీ
ఆటపాటలతో పిల్లలు, యువత సందడి


