‘ముందు’చూపు! | - | Sakshi
Sakshi News home page

‘ముందు’చూపు!

Jan 14 2026 10:05 AM | Updated on Jan 14 2026 10:05 AM

‘ముందు’చూపు!

‘ముందు’చూపు!

‘ముందు’చూపు!

అప్పుడే తాయిలాలు..

సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలతో...

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుండడంతో ఆశావహులు అలర్ట్‌ అయ్యారు. షెడ్యూల్‌ వెలువడకముందే ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కనిపించనివారు ఇంటింటికి తిరుగుతుంటే ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడకముందే ఆశావహులు ఓటరు తలుపుతడుతున్నారు. ఎన్నికల బరిలో నిలవడానికి రెడీ అయిన వారిలో చాలామంది వారం పది రోజులుగా గల్లీల్లో తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే రిజర్వేషన్‌ కలిసిరాకుంటే ఏం చేయాలా అన్నదానికీ ప్లాన్‌బీతో రెడీగా ఉన్నారు. మహిళా రిజర్వేషన్‌ వస్తే కుటుంబ సభ్యులను బరిలో దించాలన్న ఆలోచనతో ముందస్తుగానే ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వెలువడినా రంగంలోకి దిగేందుకు అవసరమైన డబ్బులను రెడీ చేసి పెట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసుకునేందుకు ఫొటోలు, వీడియోలతో సిద్ధంగా ఉన్నారు.

పలకరిస్తూ.. పనులు చేస్తూ..

కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో తుది ఓటరు జాబితాలను ప్రకటించారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలవడానికి ఆసక్తితో ఉన్నవారంతా జనంబాట పట్టారు. ఒకరిద్దరు మాజీ కౌన్సిలర్లు ఖాళీ స్థలాల్లో పెరిగిపోయిన చెట్లు, పేరుకుపోయిన చెత్తనంతా శుభ్రం చేయిస్తున్నారు. కొందరు డ్రెయినేజీలు శుభ్రం చేయించగా, మరికొందరు పైప్‌లైన్ల లీకేజీల మరమ్మతులు చేయించడంపై దృష్టి సారించారు. ఇంతకాల ముఖం చూపని వారు పొద్దున లేవగానే గల్లీలు తిరుగుతూ అందరినీ పలకరిస్తుండడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నిన్నమొన్నటి దాకా పట్టించుకోని వారు ఎన్నికల లొల్లి మొదలవుతుందనగానే వస్తున్నారని మాట్లాడుకుంటున్నారు.

జిల్లా కేంద్రంలో కొందరు ఆశావహులు సంక్రాంతి పండుగ కోసం రంగుల ప్యాకెట్లను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. కొందరు వార్డుల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలకు బహుమతులు అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ పూట మాంసం, మందు కూడా పంపిణీ చేయడానికి కొందరు ప్రణాళికలు వేసుకున్నారు. వార్డుల్లో కమ్యూనిటీ బోర్లకు సంబంధించిన సంఘాలు, కుల సంఘాలు, సంక్షేమ సంఘాలు, అభివృద్ధి సంఘాలు, కాలనీ సంఘాల వారీగా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.

మున్సిపాలిటీలల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడంతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, మాజీ కౌన్సిలర్ల కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. కామారెడ్డిలో ఆయా వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవాల్లో కాంగ్రెస్‌ నేతలు పాల్గొని రోడ్డు పనులు తమ ద్వారానే జరుగుతున్నట్లు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద పట్టణాల్లో కూడా రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పనులను వేగవంతం చేశారు.

మున్సి‘పోల్స్‌’కు ముందస్తు ప్రచారం

ఓటరు ఇంటి తలుపుతడుతున్న

ఆశావహులు

సమస్యలు తెలుసుకుని మరీ

పరిష్కరించే ప్రయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement