ఆస్మాన్‌మే ఉస్మాన్‌కి పతంగ్
మాకూ పండుగే..
● యాభై ఏళ్లుగా గాలి పటాల తయారీ
పిట్లం: మండల కేంద్రానికి చెందిన ఉస్మాన్ జీవితం గాలిపటాలతో ముడిపడి ఉంది. ఆయన కుటుంబం సుమారు యాభై ఏళ్లుగా పతంగులు తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతోంది. పిట్లం ప్రాంతంలో పతంగి అంటేనే ఉస్మాన్ గుర్తుకు వస్తారంటే అతిశయోక్తి కాదు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆయన తయారు చేసిన పతంగులు ఆకాశంలో సందడి చేస్తూ కనిపిస్తాయి. సంక్రాంతికి మూడు నెలల ముందునుంచే పతంగుల తయారీ పని ప్రారంభమవుతుందని ఉస్మాన్ తెలిపారు. కావాల్సిన వస్తువులను హైదరాబాద్‌నుంచి తెప్పించి, ఇక్కడ గాలిపటాలను తయారు చేస్తామన్నారు. మొదట్లో పిట్లంలోనే విక్రయించామని, ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, దెగ్లూర్ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే గతంలోలాగే ఇప్పటి పిల్లలు లేరని, టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల ప్రభావంతో గాలిపటాలు ఎగురవేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.
మాది ముస్లిం కుటుంబం. కానీ సంకాంత్రి వచ్చిదంటే మా ఇంట్లో పండుగ వాతవరణం ఉంటుంది. ఇంట్లో వాళ్లం అందరం గాలిపటాలు తయారు చేస్తాం. వ్యాపారం బాగుంది. సంక్రాంతి పండుగ రోజు పిల్లలు, యువకులు మేము తయారు చేసిన గాలిపటాలను ఎగురవేస్తూ ఆనందం పొందుతారు. అదే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది.
– ఉస్మాన్, గాలిపటాల వ్యాపారి, పిట్లం


