దీపంతో అగ్ని ప్రమాదం
బాల్కొండ: ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో బొంత రాజేందర్‌కు చెందిన ఇంట్లో సోమవారం ఉదయం దేవుళ్ల ఫొటో ముందు దీపం వెలిగించారు. కొన్ని గంటల తర్వాత ఇంట్లో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు అప్రమత్తమై నీటితో చల్లార్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు.
నవీపేట : మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన ఆలూరు అక్షయ్ (18) సోమవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. రోజులాగే గోదావరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన అక్షయ్ కాళ్లకు వల చిక్కుకోవడంతో నీట మునిగి మృతి చెందాడు. నది ఒడ్డున చెప్పులు, బట్టలు ఉండడంతో తల్లి సుమలత అనుమానం వచ్చి నదిలో వెతికారు. సాయంత్రం అక్షయ్ మృతదేహం లభించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో జమీర్ ఆర్డర్ మెస్‌లో జమీర్ అనే వ్యక్తి డబ్బులు తీసుకొని పేకాట ఆడిస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.14,460 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.
వర్ని: మోస్రా మండలం గోవూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ (33) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని మనస్తాపంతో ప్రశాంత్ ఈనెల 6న పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
బాల్కొండ: మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద సోమవారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ నుంచి ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన పర్యాటకుల వాహనాలు ఒకే రోడ్డుపై ఎదురెదురుగా వేగంగా రావడంతో అదుపుతప్పి ఢీకొన్నాయి. పలువురికి స్వల్పగాయాలు కావడంతో నిర్మల్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
వేల్పూర్: మండలంలోని లక్కోర మాజీ సర్పంచ్ వంశీకృష్ణపై ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన నాగం రాజేశ్, నాగం నర్సయ్యలు కత్తితో దాడి చేసినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. దాడిలో వంశీకృష్ణకు కడుపు పైభాగంలో, చేతులకు గాయాలు కాగా గ్రామస్తులు ఆర్మూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. గ్రామంలో రోడ్డుపై వంశీకృష్ణకు, రాజేశ్, నర్సయ్య ఎదురుపడగా మాటామాట పెరిగి దాడికి దారితీసినట్లు తెలుస్తోంది. వంశీకృష్ణ భార్య సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
దీపంతో అగ్ని ప్రమాదం
దీపంతో అగ్ని ప్రమాదం


