ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా
కమ్మర్‌పల్లి: భీమ్‌గల్ మండలం కుప్కాల్ ఒర్రెల నుంచి కమ్మర్‌పల్లికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడిన ఘటన కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని హాసకొత్తూర్‌లో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏ, భీమ్‌గల్ వైపు నుంచి ఇసుక ట్రాక్టర్ వస్తుండడాన్ని గమనించి అనుమానంతో తనిఖీ చేశాడు. అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆర్‌ఐ శరత్‌కుమార్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. ఆర్‌ఐ ఆదేశాలతో వీఆర్‌ఏ ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వేగంగా నడపడంతో కమ్మర్‌పల్లి శివారులోని బీడీ కంపెనీ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్టర్‌తోపాటు ఇసుకను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమాని వేముల భాస్కర్, డ్రైవర్ పల్లపు సాయికుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


