ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 80 వినతులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 80 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూసమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్‌లు, ఇందిరమ్మ ఇండ్లు, బిల్లుల మంజూరులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీవో వీణ, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లింగంపేటలో అధికారుల డుమ్మా..!
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో ప్రతీ సోమవారం ఏర్పాటు చేసే ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం పలు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొనాల్సి ఉండగా కేవలం రెండు శాఖల అధికారులు మాత్రమే హాజరుకావడం విశేషం. కార్యక్రమానికి తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి మాత్రమే హాజరయ్యారు. అన్ని శాఖల అధికారులు హాజరయ్యేవిధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.


