రెండు గ్రామాల మధ్య ఇసుక పంచాయతీ
నిజాంసాగర్(జుక్కల్): మంజీరా నదిలో ఇసుక దిబ్బ లు ఇరు గ్రామాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఇసుక తరలింపు కోసం మంజీరా నదిలో సోమవారం మాగి గ్రామస్తులు పైపులు ఏర్పాటు చేసి మట్టి, మొరంతో రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట గ్రామస్తులు, యువకులు ఇసుక దిబ్బల వద్దకు చేరుకొని పైపులైన్ పనులను అడ్డుకున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలోని ఇసుక దిబ్బలు ఉన్న ప్రదేశం తమదంటే, తమదంటూ ఇరు గ్రామాల రైతులు, ట్రాక్టర్లు యజమానులు వాదులాడుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు మంజీరా నది వద్దకు చేరుకున్నారు. పైపులైన్ పనులను ఆపాలని మాగి గ్రామస్తులకు సూచించారు.
ఇసుక కోసం రోడ్డు మార్గం..
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. మంజీరా నదిలో వరద నీటి ప్రవాహం కారణంగా ఇసుక దిబ్బలు పేరుకున్నాయి. మంజీరా నదిలో కుప్పలు, తెప్పలుగా ఉన్న ఇసుక దిబ్బల కోసం చుట్ట ప్రక్క గ్రామాల ట్రాక్టర్లున్న యజమానులు, రైతులు పోటీ పడుతున్నారు. అయితే మంజీరా నదిలో ఉన్న ఇసుక నిల్వలను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరిట ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అచ్చంపేట, ఆరేడ్, ఆరేపల్లి, పెద్ద ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి, మాగి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అనుమతులు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల నుంచి పట్టణాలకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రెండు గ్రామాల మధ్య ఇసుక పంచాయతీ


