ద్విచక్రవాహనం పైనుంచి పడి మహిళ మృతి
సదాశివనగర్: మండలంలోని దగ్గి గ్రామ శివారు 44 జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన కనకంటి సావిత్రి (45), భర్త సాయిరెడ్డితో కలిసి పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో దగ్గి చివర్లోకి రాగానే వాహనంపై ఉన్న మహిళ రోడ్డుపై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా సావిత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సదాశివనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం స్థానికులు ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. అక్రమ ఇసుక తరలింపును నిలిపివేయాలని నినాదాలు చేశారు. అనుమతి కన్నా రెట్టింపు సంఖ్యలో ఇసుక తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అవసరమైతే ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు అనుమతించాలన్నారు. అధికారుల ఉదాసీనతతో అక్రమార్కులు విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నారని వాహనాలను అడ్డుకున్నారు. పెద్ద టిప్పర్ల ద్వారా ఇసుక తరలించడంతో వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై ఇసుక మాఫీయా బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోటగిరి ఎస్సై సునీల్‌తో వాగ్వాదానికి దిగారు. అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.


