
అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
కామారెడ్డి క్రైం : జిల్లాలో రాబోయే 72 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయాల్లో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 08468–220069 లో సంప్రదించాలన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టరు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావద్దని సూచించారు. ఈత కొట్టడానికి పిల్లలను చెరువులు, వాగుల్లోకి పంపరాదన్నారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లవద్దన్నారు. రైతులు విద్యుత్ మోటార్లు, వంగి ఉన్న విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండటం మంచిది కాదన్నారు. ప్రమాదకరంగా వరద నీరు ప్రవహించే లోలెవెల్ వంతెనలు, కల్వర్టులు, కాజ్‌వేల వద్దనుంచి ప్రజలు, వాహనాలు వెళ్లకుండా బారికేడ్‌లను ఏర్పాటు చేయాలని పోలీసు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
బుధవారం ఉదయం 11 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి అధికారులు పంచాయతీల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ముందస్తు చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్