
చేపల వేటకు వెళ్లి.. పాము కాటుకు బలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): చేపలవేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై మృత్యువాత పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం అచ్చాయపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని అచ్చాయపల్లి గ్రామానికి చెందిన బెస్త అశోక్(47)ఆదివారం గ్రామశివారులోని ఊర చెరువులో చేపలు పట్టేందుకు వల వేసి, చెరువు ఒడ్డున పడుకొని ఉండగా గుర్తు తెలియని పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే అశోక్‌ను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం ఆస్పత్రిలో అశోక్ మృతిచెందినట్లు భార్య భారతి నాగిరెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు..
బాల్కొండ: మెండోరా మండలం సావెల్ శివారులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చెందిన కశవత్రి గంగాధర్(46) మృతి చెందాడు. ఎ స్సై యాసర్ ఆరాఫత్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర్ సావె ల్ గ్రామంలో తన బంధువు మైసమ్మ పండుగ చేయడంతో భోజనం కోసం వచ్చాడు. రాత్రి దోంచందకు బైక్‌పై తిరిగి వెళుతుండగా ఎదురుగా వెల్కటూర్ నుంచి సావెల్ వైపు వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఓ ప్రైవేట్ వాహనంలో ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి గంగాధర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య కశవత్రి సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.