
జిల్లాలో రౌడీయిజాన్ని నిర్మూలిస్తాం
కామారెడ్డి క్రైం : జిల్లాలో నేరాలు, బెదిరింపులు, అక్రమ దందాలకు తావులేకుండా చేస్తామని, రౌడీయిజాన్ని నిర్మూలిస్తామని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రౌడీ షీట్ కలిగిన వ్యక్తులతో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘రౌడీ మేళా‘ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రౌడీ షీట్లు ఉన్నవారు నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, హింసాత్మక చర్యలకు పాల్పడడం లాంటి నేరాలను పూర్తిగా మానుకోవాలని సూచించారు. మంచి ప్రవర్తన కనబర్చిన వారి రౌడీ షీట్లు మాత్రమే తొలగిస్తామని తెలిపారు. పోలీసు రికార్డ్స్, రౌడీ షీట్స్ రివ్యూ కమిటీ నివేదిక ప్రకారం మంచి ప్రవర్తన కలిగి ఉన్న 13 మందిపై రౌడీషీట్లు తొలగించామన్నారు. ఇతరులలోనూ ఇలాంటి మార్పు రావాలని ఆకాంక్షించారు. సత్ప్రప్రవర్తన కలిగి పదేళ్ల పాటు ఎలాంటి కేసులు లేకుండా ఉంటే నిష్పక్షపాత విచారణతో వారి రౌడీ షీట్స్ కూడా తొలగిస్తామన్నారు. గంజాయి, రౌడీయిజం, హత్యలు, హత్యాయత్నాలు, గొడవలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు తరచుగా పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో కత్తులతో ఫొటోలు పోస్ట్ చేయడం, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం, భయబ్రాంతులకు లోనయ్యేలా చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి రౌడీ మేళా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, విఠల్‌రెడ్డి, ఎస్‌బీ సీఐ తిరుపయ్య, డీసీఆర్బీ సీఐ మురళి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రాజేశ్ చంద్ర
సత్ప్రవర్తనతో మెలిగిన
13 మందిపై రౌడీ షీట్లు ఎత్తివేత