
కొనుగోళ్లలో కొర్రీలు
● మిల్లర్లు ధాన్యం తిరస్కరిస్తే
లారీ కిరాయి రైతే భరించాలి
● తరుగు విషయంలో మిల్లర్లతో
మాట్లాడుకోవాలి
● ఒప్పంద పత్రం ఇస్తేనే ధాన్యం కొనుగోళ్లు
● కొత్త కండిషన్లతో
ఇబ్బందిపడుతున్న రైతులు
బిచ్కుంద: బిచ్కుంద మండల కేంద్రంలో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. తేమశాతాన్ని పరీక్షించి కొనుగోలు చేస్తున్నారు. గడ్డిపోసలు, దుమ్ము ఉందని బస్తాకు అరకిలో తరుగు తీస్తున్నారు. అయితే దీనికి తోడు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఒప్పంద పత్రం అడుగుతున్నారు. నాణ్యత తక్కువ ఉన్న కారణంగా మిల్లర్లు వడ్లు తీసుకోవడానికి తిరస్కరిస్తే రవాణా ఖర్చులు తామే భరించుకుంటామని రైతులు ఒప్పంద పత్రం రాసి ఇస్తేనే వడ్లు కొనుగోలు చేస్తామని నిర్వాహకులు చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. రైతు రాిసిచ్చే ఒప్పంద పత్రం రైతుకు నష్టం చేసేదిగా, మిల్లర్లకు లాభం చేకూర్చే విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాణ్యత, తేమ శాతం పరిశీలించి అన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తున్నప్పుడు ఒప్పంద పత్రం ఎందుకివ్వాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
మిల్లుల్లో అదనపు కోత
వడ్ల లారీలను మిల్లులకు తరలించిన తర్వాత మిల్లర్లు వడ్లను రెండుమూడు బస్తాల నుంచి శాంపిళ్లు సేకరించి వడ్లలో నాణ్యత లేదు, తేమశాతం ఎక్కువగా ఉందని, బరువు తగ్గిందని వంకలు పెడుతూ లారీకి రెండుమూడు క్వింటాళ్ల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి ఒప్పుకోకపోతే లారీ రిటర్న్ పంపిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు సైతం మిల్లర్లకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసి ఇచ్చిన స్లిప్పును కాకుండా మిల్లు యజమాని వేసిన తూకాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఒప్పంద పత్రంలో రైతులు రాసి ఇవ్వాలని అధికారులు చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లేదంటే రైతులే నేరుగా మిల్లుకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచిస్తున్నారంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఒప్పంద పత్రం, వడ్లలో కోత లేకుండా చూడాలని కోరుతున్నారు.
బిచ్కుందలో వడ్లు ఆరబెడుతున్న రైతు
ఒప్పంద పత్రం ఇవ్వాలంటున్నరు
రైతులు ఒప్పంద పత్రం ఇస్తేనే వడ్లు కొంటామ ని అధికారులు చెబుతున్నారు. వడ్లు మిల్లుకు వె ళ్లిన తర్వాత ఏదో వంకతో రెండు, మూడు క్వింటాళ్లు కట్ చేస్తున్నారు. మిల్లు యజమాని ఎంత తగ్గించినా ఒప్పుకోవాలనడం ఎంతవరకు న్యాయం. అధికారులు న్యాయం చేయాలి.
– శ్రీనివాస్, రైతు బిచ్కుంద
పైఅధికారుల సూచనలతోనే..
మిల్లులు క్వింటాలు వడ్లకు 65 కిలోల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. యాసంగి వడ్లలో 65 కిలోల బియ్యం వస్తలేవట. నాణ్యత లేవంటూ వడ్లను రిటర్న్ పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పైఅధికారుల సూచనలతో రైతుల నుంచి ఒప్పంద పత్రం తీసుకుంటున్నాం.
– శ్రావణ్, సొసైటీ కార్యదర్శి, బిచ్కుంద

కొనుగోళ్లలో కొర్రీలు