ఇసుక, మొరం అక్రమదందాతో రెండు చేతులా సంపాదించడానికి కొందరు నాయకులు నిబంధనలకు విరుద్ధంగా
వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు అడ్డుతగలడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము చెప్పినట్లు వినాలంటూ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. మాట వినకపోతే ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తుండడంతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న
వాహనాలను సీజ్ చేయడానికి
తహసీల్దార్లు జంకుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఇసుక, మొరం అక్రమ దందా తహసీల్దార్లకు తలనొప్పి వ్యవహారంగా మారింది. అభివృద్ధి పనుల పేరుతో అక్రమంగా ఇసుక తరలించే విషయంలో కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తుండడంతో అధికారులు స్పందించాల్సి వస్తోంది. అయితే ‘మాకే అడ్డు తగులుతారా’ అంటూ కొందరు నాయకులు అధికారులపై జులూం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని అధికారులు వారికి నచ్చజెప్పుతున్నా వినిపించుకోవడం లేదు. అక్రమ దందాకు సహకరించలేదని ఓ తహసీల్దార్‌ను అధికార పార్టీకి చెందిన కొందరు ఇబ్బందులకు గురిచేసిన విషయం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తున్న వారిని అడ్డుకుని వాహనాలను సీజ్ చేయాలంటే అధికారులు జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాగా గతంలో అదే మంజీర నదిలో పదేళ్లు ఏం జరిగినా అధికారులు అటువైపు చూడలేదని, ఇప్పుడు తమను ఎలా అడ్డుకుంటారంటూ కొందరు బాహాటంగా విరుచుకుపడుతుండడం విస్మయం కలిగిస్తోంది. కరవమంటే కప్పకు కోపం విడవవంటే పాముకు కోపం అన్నట్టుగా పరిస్థితి తయారయ్యిందని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంజీరను చెరబట్టారు
జిల్లాలో విస్తారంగా ప్రవహించే మంజీర నది నుంచి అభివృద్ధి పనుల పేరుతో కొందరు ఇసుక దందాకు తెరలేపారు. నది పొడవునా పెద్ద ఎత్తున ఇసుక ఉంది. ఇసుక దందాలో ఆరితేరిన పలువురు.. అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు పొంది అక్రమంగా తరలిస్తున్నారు. మంజీర నది నుంచి ఇసుకను కామారెడ్డితోపాటు నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకూ అక్రమంగా తరలిస్తున్నారు. స్థానిక అవసరాలకు అనుమతులు పొంది, మంజీర నుంచి ఇసుకను తోడేస్తున్న ఇసుకాసురులు.. ఒక చోట డంప్ చేసి, రాత్రి వేళల్లో టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు వస్తుండడంతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇది ఇసుక దందా సాగిస్తున్న వారికి మింగుడుపడడం లేదు. అధికారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులు వచ్చినా సరే అటువైపు కన్నెత్తి చూడొద్దంటూ హుకూం జారీ చేస్తుండడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే అడ్డుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని అధికారులు చెబుతున్నా వినడం లేదు. తాము చెప్పినట్టు వినాల్సిందేనని అధికారులతో పేర్కొంటున్నారు. ఇటీవల మంజీర పరీవాహక ప్రాంతంలో పలువురు తహసీల్దార్ల బదిలీకి ఇసుక లొల్లే కారణమని తెలుస్తోంది.
యథేచ్ఛగా మట్టి తరలింపు
జిల్లాలో ఇసుకతో పాటు మట్టి, మొరం దందా యథేచ్ఛగా నడుస్తోంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పొక్లెయిన్‌లతో మట్టి, మొరం తవ్వి తరలిస్తున్నారు. దీనిపై ప్రజలు అధికారులకు సమాచారమిస్తే అధికారులు విచారణ జరుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు వెళ్లి కేసులు నమోదు చేస్తున్నారు. దీన్ని అక్రమార్కులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు అడ్డు తగలొద్దంటూ అధికారులను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది.
నిబంధనలకు విరుద్ధంగా
ఇసుక, మొరం దందా
అటువైపు చూడొద్దంటూ
అధికార పార్టీ నేతల హుకూం
వాహనాలను సీజ్ చేయాలంటే
జంకుతున్న అధికారులు
బాన్సువాడ/మద్నూర్ : ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. శుక్రవారం డోంగ్లీ నుంచి బీర్కూర్‌కు వస్తుండగా కుర్లా సమీ పంలో మంజీర బ్రిడ్జి వద్ద ట్రాక్టర్లలో ఇసుకను నింపుతుండడాన్ని ఆమె గమనించారు. వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చి ట్రాక్టర్లను పట్టుకునే ప్రయత్నం చేశారు. సబ్ కలెక్టర్‌ను గమనించిన ట్రాక్టర్ యజమానులు అక్కడి నుంచి పారిపోయారు. ఇసుక అక్రమ రవాణా కోసం ఏర్పాటు చేసిన దారిని పొక్లెయిన్ సహాయంతో తొలగింపజేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని అధికారులకు సూచించారు.
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు


