మున్సిపోల్‌ హీట్‌ | - | Sakshi
Sakshi News home page

మున్సిపోల్‌ హీట్‌

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

● ఓటర్ల లెక్క తేలింది

● రిజర్వేషన్ల పైనే ఉత్కంఠ

● న్యాయ వివాదాల ప్రభావంతో కాకినాడ, రాజమహేంద్రవరంలో ఆగిన ప్రక్రియ

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పురపోరుకు రంగం సిద్ధమవుతోంది. మున్సిపల్‌ ఎన్నికల కసరత్తులో అధికారులు తలమునకలవుతున్నారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన సామాజిక వర్గాల వారీగా ఓటర్ల గణన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఓటర్ల తుది జాబితా ప్రచురించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల కేటగిరీల వారీగా జాబితా వెల్లడించారు. ఇక మున్సిపల్‌ చైర్మన్‌, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాక ఎన్నికలకు మార్గం సుగమం కానుంది. అధికారులు రూపొందించిన తుది జాబితాలను మున్సిపల్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. త్వరలోనే రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజకీయ వేడిని రాజేస్తోంది. రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందా.. ఎప్పుడు బరిలోకి దిగుదామా అని ఆశావహులు నిరీక్షిస్తున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరిలో ఇలా..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లు, తొమ్మిది పురపాలక సంఘాలు (తుని, మండపేట, అమలాపురం, సామర్లకోట, పెద్దాపురం, నిడదవోలు, కొవ్వూరు, రామచంద్రపురం, పిఠాపురం), 3 నగర పంచాయతీలు (ఏలేశ్వరం, ముమ్మిడివరం, గొల్లప్రోలు) ఉన్నాయి. వీటిలో రామచంద్రపురం మినహా మిగిలిన పురపాలక సంఘాల్లో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల గణన పూర్తయింది. రామచంద్రపురంలో వార్డుల విభజన విషయంలో న్యాయ వివాదాలు తలెత్తడంతో కుల గణన ప్రక్రియ ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.

ఆశావహుల్లో ఉత్కంఠ

సామాజిక వర్గాల వారీగా ఓటర్ల గణన ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో ఇక ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైనట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. పురపాలక సంఘ చైర్మన్‌, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లు ఖరారైతే ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. సామాజిక వర్గాల వారీగా తమకు మద్దతు పలికే వారెవరంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఆయా సామాజిక వర్గాల ఓటర్లను ఇప్పటి నుంచే ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.

ఎన్నికల ప్రకటన కోసం..

మున్సిపల్‌ ఎన్నికలు అక్టోబర్‌ నెలాఖరులోపు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రకటన కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి ఎన్నికల నోటిఫికేషన్‌, పోలింగ్‌ తేదీలు ఖరారైతే రాజకీయం మరింతగా వేడెక్కనుంది.

అక్కడ ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే?

కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగడం అనుమానంగా మారింది. రాజమహేంద్రవరం, కాకినాడ కార్పొరేషన్లలో కొన్ని గ్రామాలు విలీనం చేయాలన్న డిమాండ్‌ నెలకొంది. ఈ విషయమై ఇప్పటికే న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. అవి పూర్తయ్యేవరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అవకాశం లేదు. ఫలితంగా రెండు కార్పొరేషన్ల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే అన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సామజిక వర్గ ఓటర్ల వివరాలు ఇలా..

మున్సిపాలిటీ ఎస్టీ ఎస్సీ బీసీ ఇతరులు

అమలాపురం 581 5,093 14,211 21,194

తుని 210 7,241 20,489 15,090

మండపేట 336 5,334 27,344 16,046

సామర్లకోట 545 8,331 14,862 20,218

పెద్దాపురం 415 3,291 25,996 11,826

కొవ్వూరు 389 6,953 13,315 13,795

ఏలేశ్వరం 747 5,698 12,231 6,796

ముమ్మిడివరం 164 5,689 10,431 4,944

గొల్లప్రోలు 46 2,685 4,339 13,776

వైఎస్సార్‌సీపీలో ధీమా..

స్థానిక ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ ధీమాగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. కూటమి అరాచకాలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారు. ఫలితంగా ప్రజా మద్దతు కూడగట్టుకుంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది.

కూటమిలో వణుకు..

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి నేతలు అక్రమార్జనకు అర్రులు చాస్తున్నారు. పథకం ఏదైనా.. దోపిడీయే పరమావధిగా తెగబడుతున్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణాలో రూ.కోట్లు దోచుకుంటున్నారు. సంక్షేమ పథకాల్లో కోతలు విధించి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దీంతో ఎన్నికలకు వెళితే ఘోర పరాజయం తప్పదన్న భావనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement