వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
కొత్తపేట: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు. స్థానిక పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు చేపట్టిన దీక్షలు 11వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో శనివారం దీక్షా శిబిరాన్ని సందర్శించిన జగ్గిరెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. వారి సమస్యలను, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 రోజులుగా ఎండను, వర్షాన్ని, కుటుంబ పరిస్థితులను లెక్కచేయకుండా తమ న్యాయమైన హక్కుల కోసం వీఆర్‌ఏలు దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు, రెవెన్యూ శాఖ కార్యకలాపాల్లో వీఆర్‌ఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారికి న్యాయమైన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కుటుంబ ఖర్చుల నేపథ్యంలో నెలకు లభిస్తున్న గౌరవ వేతనం సరిపోదని, వారి సేవలకు అనుగుణంగా గౌరవప్రదమైన వేతనం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వారి నిరసన దీక్షను రాజకీయ కోణంలో చూడకుండా మానవతా దృక్పథంతో ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట పార్టీ నేతలు గొల్లపల్లి డేవిడ్‌రాజు, మార్గన గంగాధరరావు, ముసునూరి వెంకటేశ్వరరావు, ముత్యా వీరభద్రరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు గూడపాటి రమాదేవి, కుర్రా శ్రీను తదితరులు ఉన్నారు. 11వ రోజు దీక్షలో వీఆర్‌ఏల సంఘ జిల్లా నాయకుడు పిల్లంగోరు బాలు, నేతలు కే భీమశంకరం, సత్యనారాయణ, ఇస్సాక్, లవరాజు, ఎస్.నాగభూషణం తధితరులు పాల్గొన్నారు.


