వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీ శివకుమారి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తుని నియోజకవర్గ నేత యనమల కృష్ణుడు పార్టీ మారితే ఎవరికీ నష్టం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి స్పష్టంచేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్ జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను వదులుకొని పార్టీలు మారుతున్నారన్నారు. యనమల కృష్ణుడు తుని ఎమ్మెల్యే కావాలన్న ఆశ నెరవేరదని జోస్యం చెప్పారు. యనమల రామకృష్ణుడు వదిలేస్తే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారని, ప్రస్తుతం జనసేన తీర్థం పుచ్చుకున్నంత మాత్రాన వైఎస్సార్ సీపీకి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. తునిలో దాడిశెట్టి రాజా నేతృత్వంలో పార్టీ బలంగా ఉందన్నారు. ఎలాంటి ఎన్నికలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు, సంక్షేమ పథకాలు అందరికీ అందాయని, తిరిగి ఆయన పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, నేతలు సరోజ, సుంకర శివ ప్రసన్న, శేషకుమారి, నాగ మల్లేశ్వరి, బెహరా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


