కాకినాడ రూరల్: దేశ, రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న వివిధ వాహనాల డ్రైవర్లను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆల్ డ్రైవర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకూ వివిధ డ్రైవర్ల యూనియన్లతో కూడిన జేఏసీకి కాకినాడలో సోమవారం అంకురార్పణ జరిగింది. తిమ్మాపురంలోని అంబేడ్కర్ సామాజిక భవనంలో వాసు ఏలేటి అధ్యక్షతన జరిగిన జేఏసీ ఆవిర్భావ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లారీ, ట్రక్కులు, ప్రైవేటు బస్సులు ఇతర ప్రైవేటు వాహనాల డ్రైవర్లు తరలి వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో డ్రైవర్లు, ఆయా అసోసియేషన్ల నాయకులు ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు రక్షణ లేదని, సంక్షేమం అందడం లేదని అన్నారు. ఒడిశా, కర్ణాటక మాదిరిగా మన రాష్ట్రంలో కూడా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన వాసు ఏలేటిని జేఏసీ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రైవర్లకు ఇచ్చిన వందలాది హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. గత ఎన్నికల్లో డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని, ప్రతి డ్రైవర్‌ను ఓనర్‌ను చేస్తామని, డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, వీటిల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. పొరుగున ఉన్న ఒడిశా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్ల వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేశాయని, అలా ఇక్కడ ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డ్రైవర్ల సంక్షేమంపై చంద్రబాబు ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు లక్ష్యంగానే జేఏసీ ఏర్పాటు జరిగిందని చెప్పారు. సమావేశంలో చంద్రశేఖర్, యోహాను, మనోజ్ సాహు (విశాఖ), అన్వర్ బాషా (కర్నూలు), జిలాని (చిత్తూరు జిల్లా పలమనేరు), ఎస్‌కే మస్తాన్ (దేవరపల్లి) తదితరులు పాల్గొన్నారు.
ఫ కాకినాడలో ఆవిర్భావ సమావేశం
ఫ ప్రభుత్వం తమను
మోసం చేస్తోందని నాయకుల ఆవేదన
ఫ చైర్మన్‌గా వాసు ఏలేటి ఎన్నిక


