బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 284 అర్జీలు సమర్పించారు. అలాగే, రెవెన్యూ క్లినిక్‌కు 38 అర్జీలు అందజేశారు. వారి నుంచి కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, డీఆర్‌ఓ తిప్పేనాయక్, డ్వామా పీడీ మధుసూదన్, ట్రైనీ కలెక్టర్ ప్రియ, జిల్లా స్థాయి అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన అర్జీలపై అధికారులు సత్వరం సమగ్ర విచారణ చేపట్టి, నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు.
కుక్కల సమస్య పరిష్కరించాలి
మా డివిజన్‌లో కుక్కల సమస్య చాలా ఎక్కువగా ఉంది. రాత్రి, పగలు తేడా లేకుండా కుక్కలు గుంపులు గుంపులుగా చేరి ప్రజలను గాయపరుస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. రాత్రి వేళ ఒంటరిగా నడిచి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ద్విచక్రవాహనాలపై వెళ్తున్నవారిని కూడా కుక్కలు గాయపరుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలి.
– గోడి సత్యవతి, మాజీ కార్పొరేటర్


