బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ–అమరావతి జిల్లా శాఖ చైర్మన్ పితాని త్రినాథ్, ప్రధాన కార్యదర్శి ఎన్‌వీఎస్‌ఎస్‌ఆర్‌కే దుర్గా ప్రసాద్, రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ స్పష్టం చేశారు. ఏపీ జేఏసీ–అమరావతి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టర్, ఆర్‌డీఓలకు నాయకులు సోమవారం ఉద్యమ కార్యాచరణ నోటీసులు అందించారు. 12వ పీఆర్‌సీ కమిషనర్‌ను వెంటనే నియమించాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని, డీఏ బకాయిలు చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, పాత పింఛన్ విధానం అమలు చేయాలని, ఉద్యోగుల హెల్త్ కార్డులను వెంటనే వినియోగంలోకి తీసుకు రావాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, వారికి హెచ్‌ఆర్ పాలసీ వర్తింపజేయాలని, 2010 ముందు నియమితులైన ఉపాధ్యాయిలకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు 29 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పి.దుర్గాప్రసాద్, మహిళా చైర్‌పర్సన్ శిరీష, ప్రధాన కార్యదర్శి ముంతాజ్, జిల్లా ట్రెజరర్ సీవీవీ సత్యనారాయణ, వీఆర్‌ఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నా, రెవెన్యూ డివిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


