రూ.30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Aug 29 2026 12:23 AM | Updated on Aug 29 2026 12:23 AM

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురి అరెస్టు

కోరుకొండ: ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి నుంచి ఢిల్లీకి తరలిస్తున్న గంజాయితో పాటు ముగ్గురిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో నార్త్‌ జోన్‌ డీఎస్పీ సీహెచ్‌ జీవన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి రవాణాపై అందిన సమాచారం మేరకు బూరుగుపూడి జంక్షన్‌లోని పెట్రోల్‌ బంకు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారు డిక్కీలో 3 బస్తాల్లో నింపిన 61 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. సరకుతో పాటు కారులోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం తాండ, బాగవత్‌ ప్రాంతానికి చెందిన సదకత్‌, బార్కండి శామ్లి జిల్లాకు చెందిన సదాబ్‌, సల్మాన్‌లను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ రూ.30 లక్షలు ఉంటుందని, నిందితుల నుంచి మూడు మొబైల్‌ ఫోన్లు, రూ.10,500 నగదు స్వాధీనం చేసుకున్నట్టు జీవన తెలిపారు. ఈగల్‌ టీమ్‌ సహకారంతోనే గంజాయి రవాణాను అడ్డుకోగలిగామని ఆమె తెలిపారు. ఈ కేసులో కృషి చేసిన కానిస్టేబుల్స్‌ రవికిరణ్‌, ప్రకాష్‌ రెడ్డి, రామచంద్రరావు, సుబ్రహ్మణ్యంలకు ఆమె రివార్డులు అందజే శారు. సమావేశంలో సీఐ ఎస్‌వీవీఎస్‌ మూర్తి, ఎస్సై సీహెచ్‌వీ రమేష్‌ పాల్గొన్నారు.

వివాహితపై లైంగిక దాడి

కడియం: నర్సరీలో తన భర్తతో పనిచేసే సురేంద్ర అలియాస్‌ చిన్న తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బుర్రిలంకకు చెందిన 19 ఏళ్ల మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళ తన భర్తతో కలిసి బుర్రిలంక నర్సరీకి ఈ ఏడాది జూలైలో పని కోసం వచ్చారు. అప్పటి నుంచి నర్సరీలో పనిచేస్తూ కార్యాలయ భవనం పక్కన నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ ఉదయం సుమారు 6:45 గంటలకు, ఆమె భర్త యథావిధిగా పనికి వెళ్లాడు. అనంతరం 7 గంటలకు అదే నర్సరీలో పనిచేస్తున్న సురేంద్ర అలియాస్‌ చిన్న ఆమె ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తన భర్తకు చెపుతానని హెచ్చరించడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం 8.50 నిమిషాలకు మళ్లీ వచ్చి ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికై నా చెప్తే భార్యాభర్తలిద్దరినీ చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తన భర్తకు ఆమె విషయాన్ని వివరించింది. దీంతో అతడు నర్సరీ యజమానికి ఆ విషయం చెప్పగా ఆయన సూచన మేరకు బాధితురాలు ఆమె బంధువులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చోరీ సొత్తు స్వాధీనం

కొత్తపేట: స్థానిక ఆర్‌ఎస్‌ నగర్‌లో నివసిస్తున్న పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంటిలో చోరీకి గురైన సుమారు రూ 25 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులతో పాటు నిందితుడిని అరెస్టు చేసినట్టు ఎస్సై జి.సురేంద్ర శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్పీ కార్యాలయంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చెల్లిబోయిన రాంబాబు ఈ నెల 18వ తేదీ రాత్రి తన భార్యతో కలిసి హాస్పిటల్‌ పని నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లి తిరిగి 20వ తేదీ ఉదయం 8 గంటలకు వచ్చారు. వారు వచ్చే సరికి ఇంటి తలుపు తాళం, లోపలి బీరువా పగలగొట్టబడి అందులోని సుమారు 23 కాసుల బంగారు, సుమారు 880 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. రాంబాబు ఫిర్యాదు మేరకు డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ పర్యవేక్షణలో అమలాపురం సీసీఎస్‌ సీఐ ఎన్‌ కొండయ్య, సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి, రావులపాలెం రూరల్‌ సీఐ విద్యాసాగర్‌ దర్యాప్తు చేశారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు పలివెల వంతెన వద్ద చోరీ కేసులో పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన నగరపు ఈశ్వరరావు అలియాస్‌ సింగనపూడి ఈశ్వరరావును సీఐ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేసి, అతని నుంచి చోరీ సొత్తు (సుమారు రూ.25 లక్షలు)ను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు అతడు ఉపయోగించిన మోటార్‌ సైకిలు, రెండు ఇనుప రాడ్‌లను సైతం స్వాధీనం చేసుకుని అతడిని కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్‌ అతడికి 15 రోజుల రిమాండ్‌ విధించినట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement