రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి
రావులపాలెం: కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ విషాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన మైనర్ రియాన్ష్ కార్తికేయరెడ్డికి పూర్తి రక్షణ కల్పించి, అతని భవిష్యత్తుకు అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు తెలిపారు. స్థానిక బాలుడి తాతయ్య కొవ్వూరి భాస్కరరెడ్డి ఇంటికి శుక్రవారం ఆయనతో పాటు కమిషన్ సభ్యులు వచ్చి రియాన్ష్‌ను పరామర్శించి మాట్లాడారు. విషాద ఘటన పూర్వాపరాలను తెలుసుకుని అతని రక్షణ, విద్య, భవిష్యత్తుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బాలుడిని, ఆమె తల్లిని సాధిక్ ఖాన్ ఏ విధంగా వేధించినదీ తెలుసుకున్నామని తెలిపారు.
కలెక్టరేట్‌లో ఈ మేరకు సమీక్షించి తదుపరి చర్యలకు ప్రభుత్వానికి, డీజీపీకి అవసరమైన సిఫార్సులు, ఆదేశాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కమిషన్ సభ్యురాలు డాక్టర్ పి.నాగ మానస మాట్లాడుతూ అతని భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సాధిక్ ఖాన్‌కు శిక్ష పడేలా చూస్తాం
బోట్‌క్లబ్: రియాన్ష్‌ను రావులపాలెంలోని అతడి తాతయ్య ఇంటి వద్ద పరామర్శించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు అనంతరం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కాకినాడలో పోలీస్, విద్యాశాఖ అధికారులతో పాటు బాలుడి పాఠశాల యాజమాన్యం, రైఫిల్ షూటింగ్‌లో శిక్షణ ఇచ్చిన స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామన్నారు. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయేలా చేసి, బాలుడి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిన నిందితుడు సాధిక్ ఖాన్‌కు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో బాలల హక్కుల కమిషన్ సభ్యుడు ఎం.రంగసూర్యనారాయణ పాల్గొన్నారు.


