అనపర్తి: దారి తప్పి ఇబ్బంది పడుతున్న వారిని బెదిరించి, బలవంతంగా డబ్బు వసూలు చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై వాసంశెట్టి రవిచంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన మిరియాల సుబ్రహ్మణ్యం, పలివెల వీరబాబు ఆదివారం పందలపాకలో జరిగిన తమ తోటి తాపీమేస్త్రి యల్ల సింహాద్రి వివాహానికి మోటారు సైకిల్‌పై వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత స్వగ్రామానికి బయలుదేరారు. అయితే దారి తప్పి రాత్రి సుమారు 10:30 గంటలకు ఆ గ్రామంలోని వైన్ షాప్ వద్ద తిరగసాగారు. ఇంతలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి వీరిని అడ్డగించారు. బైక్ తాళాన్ని, సుబ్రహ్మణ్యం సెల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. నిందితులలో ఒక వ్యక్తి వీరబాబును బెదిరించి, మద్యం కోసం డబ్బులు అడిగాడు. లేవంటే బెదిరించి, స్కానర్ ద్వారా వైన్ షాప్‌కు ఫోన్‌పేలో డబ్బు చెల్లించేలా బలవంతం చేశారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం జేబులోని రూ.500 తీసుకుని, సెల్‌ఫోన్‌తో సహా అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హత్యా స్థలం పరిశీలన
రాజానగరం: మండలంలోని చక్రద్వారబంధంలో వివాహిత హత్యకు గురైన ప్రాంతాన్ని ఎస్సై జీవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు మంగళవారం పరిశీలించారు. తాగుడుకు బానిసైన మట్టపర్తి నాగబాబు తన భార్య కుమారి పీక నులిమి, ఆపై గొంతును తాడుతో బిగించి హతమార్చిన సంగతి విదితమే. మృతురాలి తల్లి వనుం రాధ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు, హత్యకు దారితీసిన కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
నేడు పోలీసు కస్టడీకి
ప్రియాంక కేసు నిందితులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో కారుతో ఢీకొట్టి డాక్టర్ ప్రియాంక మృతికి కారణమైన నిందితులను పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నిందితులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసఫ్ ఎడ్వర్డ్లను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.


